smile smile smile smile smile smile smile smile smile smile smile

రావణ జన్మభూమిలో రాముడి సంబరాలు.. మరి ఆగ్రహం రాదా? ఆసక్తికర వివరాలు

అందరూ రాముడిని పూజిస్తే అక్కడ మాత్రం రావణాసురుడిని ఆరాధిస్తారు. దసరా నవరాత్రుల వేళ సంతాప దినాలుగా పాటిస్తారు. కానీ, అయోధ్య రామ మందిర భూమి పూజ వేళ వేడుకలు చేశారు. మరి రావణుడికి ఆగ్రహం రాదా?

యోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగుతున్న వేళ దేశమంతా పండుగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పలు నగరాల్లో ప్రజలు, శ్రీరాముడి భక్తులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. రావణాసురుడి జన్మస్థలంలోనూ రాముడి గుడికి సంబంధించి సంబరాలు జరుపుకోవడం విశేషం. మరి దశకంఠుడికి ఆగ్రహం రాదా.. ఆసక్తికర వివరాలు.

‘బిస్రాఖ్’ అనేది నోయిడాకు సమీపంలోని ఓ కుగ్రామం. రావణాసురుడు ఈ ప్రాంతంలోనే జన్మించాడని స్థానికుల నమ్మకం. ఇక్కడ రావణాసురుడికి ఓ గుడి ఉంది. అక్కడ నిత్య పూజలు కూడా జరుగుతాయి. దసరా నవరాత్రుల సమయంలో దేశమంతా సంబరాలు చేసుకుంటే.. ఈ గ్రామంలో మాత్రం సంతాప దినాలుగా పాటిస్తారు. ఆ సమయంలో సంబరాలు జరుపుకుంటే రావణుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారి భయం.

ఇక్కడ రావణాసురుడి ఆలయంలో రావణుడి విగ్రహంతో పాటు, శివ, పార్వతి, కుబేరుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ మందిరం రాత్రి వేళలోనూ తెరిచే ఉంటుంది. ఈ గ్రామానికి వచ్చే వారిలో చాలా మంది రావణుడికి పూజలు నిర్వహిస్తారు. వీరిలోనూ చాలా మంది ఎక్కడ ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోననే భయంతోనే పూజలు చేస్తారు.

పురాణాల ప్రకారం ఇక్కడి ఆలయానికి 200 మీటర్ల దూరంలో రావణాసురుడి తండ్రి విశ్రావ తపస్సు చేశాడు. శివుడుని ప్రసన్నం చేసుకొని వరం పొందాడు. ఆ తర్వాత రావణాసురుడు జన్మించాడని చెబుతారు. రావణుడి తండ్రి తపస్సు చేసిన ప్రాంతంలో ఎలాంటి విగ్రహాలు లేవు. కదంబ వృక్షం మాత్రం ఉంది. దాన్నే రావణాసురుడి జన్మస్థలంగా భావిస్తున్నారు. అక్కడ కూడా పూజలు చేస్తారు.

ఇదిలా ఉండగా.. అయోధ్యలో రామ మందిరం భూమిపూజ కార్యక్రమం సందర్భంగా బిస్రాఖ్‌లోనూ ఉత్సవాలు జరిపారు. అదేంటీ.. మరి మీ రావణాసురుడు ఆగ్రహించడా అనడిగితే.. ‘అసలు రాముడు లేకుంటే రావణుడు లేడుగా..’ అని చెబుతున్నారు మందిర పూజారి మహంత్‌ రామ్‌దాస్‌. అంతేకాడు, రావణాసురుడు లేకుంటే రాముడూ లేడని అంటున్నారు. అందుకే అయోధ్యలో భూమిపూజ సందర్భంగా మిఠాయిలు పంచుతున్నామని చెప్పారు. ఆ పూజారి పేరులోనూ రాముడే ఉండటం యాదృశ్చికం.

రామ మందిరానికి పునాది రాయి వేసిన సందర్భంగా ఈ ప్రాంతంలోనూ ‘జై శ్రీరాం’ నినాదాలు మిన్నంటాయి. అంతేకాదు.. రామ మందిర నిర్మాణానికి ఇక్కడ నుంచి కూడా పవిత్ర మట్టిని పంపించారు. దేశంలోని 2000 ప్రాంతాల నుంచి మట్టిని, 101 నదుల నుంచి జలాలను అయోధ్య భూమి పూజకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాములవారు తన ఇంటికి వెళ్లబోతున్నాడని.. రావణ గ్రామం బిస్రాఖ్ నివాసులమైన మాకు ఈ విషయంలో చాలా ఆనందంగా ఉందని ఆచార్య అశోకానంద్ మహారాజ్ అన్నారు. ఇక్కడి రావణాసురుడి మందిరాన్ని ఈయనే పర్యవేక్షిస్తారు.

రావణుడు మంచివాడే.. కానీ!
మీ గ్రామవాసులు రావణుడిని ఎందుకు ఆరాధిస్తారు? అలా ఆరాధిస్తూనే రాముడి మందిరానికి సబంధించిన వేడుకలు ఎందుకు జరుపుకొంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు అశోకానంద్ సమాధానమిస్తూ.. ‘హిందూ మతం వైవిధ్యమైనది. దేవుడి పట్ల భయం హిందూ మతంలో ఒక భావన కాదు, ఇదంతా కర్మ సిద్ధాంతం. భగవంతుడు ప్రతిచోటా, అన్ని జీవుల్లో, ప్రాణములేని వాటిలో, మంచిలో, చెడులో, మనందరిలో ఉన్నాడు’ అని వివరించారు.

‘రావణుడు శివుడి భక్తుడు. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించే వరకు చెడ్డ వ్యక్తి కాదు. రావణుడు చాలా శక్తిమంతుడు. తనకు మోక్షాన్ని ప్రసాదించగలిగే ఒకే ఒక వ్యక్తి రాముడేనని ఆయనకు తెలుసు. అందుకే రాముడితో వైరం పెట్టుకున్నాడు. రాముడు లేకుండా రావణుడు అసంపూర్ణం’ అని అశోకానంద్ చెప్పుకొచ్చారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *