ఉడుముల గ్రెగరీ రెడ్డి గారికి ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల నామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతి
హైదరాబాద్ లో సెయింట్ జోషఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు అయిన మా గురువు శ్రీ యు.జి. గ్రెగరీ రెడ్డి వారి పేరును 2022 సంవత్సరానికి పద్మా అవార్డుల నిమిత్తం మేము సగర్వంగా ప్రతిపాదిస్తున్నాము.
అయిదు దశాబ్దాల కిందట శ్రీ గ్రెగరీ రెడ్డి సెయింట్ ఆంథోనీ హైస్కూల్ ని స్థాపించారు. ఆయన కొన్ని వేలమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఆయన శిష్యులే సుమారు 75 వేల మంది ఉంటారు.
శ్రీ గ్రెగరీ రెడ్డి గారు ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేవారు. “నేను కొన్ని జీవితాలను క్రమబద్ధం చేయడానికే నేను వెదురుబద్దని వాడతాను” అని గ్రెగరీ రెడ్డి అనేవారు.
పాఠశాల రాజ్యాంగం, నియమావళి, సాంస్కృతిక ప్రమాణాలు, విలువలు వంటివి విద్యార్థులకు అలవర్చడంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. ఫలితంగా విద్యార్థుల మీద ఆయన ప్రభావం విశేషంగా ఉండేది. శ్రీ గ్రెగరీ రెడ్డి గారి దగ్గర విద్యాభ్యాసం చేసిన ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు ప్రపంచమంతటా గొప్ప విద్యావేత్తలుగా, శాస్త్రజ్ఞులుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడి భారత కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తున్నారు. భారతదేశ నిర్మాణంలో శ్రీ గ్రెగరీ రెడ్డి సేవలు చిరస్మరణీయమైనవి.
శ్రీ గ్రెగరీ రెడ్డి తన వృత్తిని చాలా చిన్నగా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి సమాజ హితం కోసం విశేషమైన కృషి చేశారు. ఉత్తమ విద్యావేత్తగా శ్రీ గ్రెగరీ రెడ్డి భారతదేశంలోనూ, విదేశాలలో కూడా ఎన్నో అవార్డులు అందుకొన్నారు. సమాజ నిర్మాణానికి ఆయన విశేషమైన, చిరస్మరణీయమైన కృషి చేశారు. విద్యార్థుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిని పరిష్కరించడానికి తక్షణం స్పందించేవారు శ్రీ గ్రెగరీ రెడ్డి.
సమాజం మీద బలమైన, నిర్మాణాత్మకమైన ముద్ర వేసిన వారిని గౌరవించడంలో మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. భారతదేశ పౌరులుగా ప్రతిష్టాత్మకమైన పద్మా పురస్కారాలకు మేము కీర్తిశేషులు శ్రీ గ్రెగరీ రెడ్డి గారి పేరుని ప్రతిపాదిస్తున్నాము.
విద్యారంగంలో ఉన్నతమైన ప్రమాణాలను నెలకొల్పడంలో శ్రీ గ్రెగరీ రెడ్డి గారు అందించిన సేవలు అనుపమానం. అందుకే మరణానంతరం ఇచ్చే పద్మా పురస్కారాలకు గాను మేము శ్రీ గ్రెగరీ రెడ్డి గారి పేరుని ప్రతిపాదిస్తున్నాము.
స్కూలు విద్యార్థిగా, ఆ తరువాత మా గురువు శ్రీ గ్రెగరీ రెడ్డి గారి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ జీవితాన్ని దగ్గర నుండి చూసే భాగ్యం మాకు కలిగింది. ఆయన ఇటీవలే ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్లిపోయారు. కానీ, గత అయిదు దశాబ్దాలుగా ఆయన దగ్గర విద్య నేర్చుకున్న విద్యార్థులందరూ ఇప్పటికీ ఆయన పట్ల అంతే గురుభావంతో, కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటారు.
మన దేశానికి గొప్ప పౌరులను అందించిన శ్రీ గ్రెగరీ రెడ్డి గారి సేవలను ప్రభుత్వం గురించి సన్మానించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సెయింట్ ఆంటోనీ విద్యావ్యవస్థల నిర్మాణంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపి విశేష గౌరవాన్ని సంపాదించుకున్నారు. చక్కని విద్యని అందించడం ద్వారా సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడంలోనూ, మానవ విలువలను పెంపొందించడంలోనూ ఆయన విరామం లేకుండా శ్రమించారు. ఈ బృహత్తర బాధ్యత ఆయనతో అంతం కాకుండా ఆరోగ్యకరమైన వ్యవస్థలను ఆయన రూపొందించారు. ఆ వ్యవస్థలు ఇప్పటికీ ఆయన బాటలో నడుస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నాయి.
ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ, పద్మా పురస్కారం ద్వారా ఆయన కీర్తి చిరస్థాయిగా నిలవాలని మేము ఆశిస్తున్నాము.
వల్లూరి రమేష్…వ్యవస్థాపక అధ్యక్షులు – విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి సభ, అట్లాంటా, అమెరికా)
(హైదరాబాద్ సెయింట్ ఆంటోనీ హైస్కూలు పూర్వ విద్యార్థి)
చలమేడ లక్ష్మి నరసింహ రావు…
మేనేజింగ్ డైరెక్టర్, సి.ఇ.ఓ.
చలమేడ ఆనందరావు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్.
(హైదరాబాద్ సెయింట్ ఆంటోనీ హైస్కూలు పూర్వ విద్యార్థి)
సి. ఎస్. రంగరాజన్
(ప్రధాన పూజారి, చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం.
హైదరాబాద్ సెయింట్ ఆంటోనీ హైస్కూలు పూర్వ విద్యార్థి).