టాలీవుడ్ నుంచి నెక్స్ట్ ‘పాన్ ఇండియా స్టార్’ ఎవరు..?
టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర భాషల్లోనూ తమ మార్కెట్ విస్తరించుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా స్టార్ డమ్ సంపాదించున్నారు.
దాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు డార్లింగ్ సినిమాలన్నీ అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తదుపరి సినిమాలను సిద్ధం చేసుకుంటున్నాడు.
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివతో తారక్ చేయబోయే సినిమా.. శంకర్ – గౌతమ్ తిన్ననూరిలతో చరణ్ చేసే చిత్రాలను మల్టీలాంగ్వేజ్ లలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యువ హీరో విజయ్ దేవరకొండ సైతం పాన్ ఇండియా స్టార్ డమ్ పై కన్నేశారు. తెలుగులో ఇప్పటికే క్రేజ్ ఏర్పరచుకున్న విజయ్.. ఇప్పుడు ‘లైగర్’ మూవీని హిందీతో పాటుగా ఇతర ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సుకుమార్ – పూరీ జగన్నాథ్ లతో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు.
‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇన్నాళ్ళూ తెలుగుకే పరిచయమైన రవితేజ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు కూడా త్వరలో రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న ‘డెవిల్’ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సందీప్ కిషన్ చేస్తున్న ‘మైఖేల్’ సినిమాని కూడా మల్టీ లాంగ్వేజెస్ లో ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ చేస్తున్నారు. ఇలా చాలా మంది హీరోలు ఇప్పుడు జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరు పాన్ ఇండియా స్టార్స్ గా మారుతారో చూడాలి.