smile smile smile smile smile smile smile smile smile smile smile

‘విద్రోహి’ మూవీ రివ్యూ: సరికొత్త పాయింట్‌తో ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ ర‌వి ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే ఎక్కువ‌గా పోలీస్ పాత్ర‌లే గుర్తొస్తాయి. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎక్కువ‌గా ఖాకీ డ్రెస్‌లోనే క‌నిపించిన ఆయ‌న, మ‌రోసారి పోలీస్ పాత్ర‌లో న‌టించిన మూవీ ‘విద్రోహి’. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో న‌టించారు. ఈ సినిమాకు వి.ఎస్‌.వి ద‌ర్శ‌క‌త్వం వహించారు. మ్యాజిక్ మూవీస్ బ్యానర్‌పై విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గారావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ
ఈ కథలో కార్తీక్ (రవి ప్రకాష్) సూర్యాపేట టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తుంటాడు. అతని భార్య నిహారిక (చరిష్మా శ్రీకర్) అదే పట్టణంలోని అవిష్ ఆసుపత్రిలో డాక్టర్‌. ఒకరోజు, ఒక ముసుగు ధరించిన వ్యక్తి ఒక కాల్ గర్ల్‌ను గొంతు కోసి దారుణంగా హత్య చేస్తాడు. ఆ హంతకుడు ఎవరో తెలియక ఆ కేసు మిస్టరీగా మిగిలిపోతుంది.

అదే ముసుగు వ్యక్తి, అర్ధరాత్రి సైకిల్‌పై తిరుగుతూ, దొంగ తాళాలు ఉపయోగించి ఇళ్లలోకి చొరబడుతుంటాడు. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళలకు మత్తుమందు ఇచ్చి, వారు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారం చేస్తుంటాడు. ఈ క్రమంలో, డాక్టర్ నిహారిక స్నేహితురాలైన పవిత్ర పెద్ద కూతురు దీప్తిపై కూడా అత్యాచారం జరుగుతుంది. ఉదయం దీప్తికి దద్దుర్లు, తీవ్రమైన రక్తస్రావం కావడంతో పవిత్ర ఆమెను నిహారిక వద్దకు తీసుకెళ్తుంది. పరీక్షించిన నిహారిక, దీప్తి అత్యాచారానికి గురైందని నిర్ధారిస్తుంది. షాక్‌కు గురైన పవిత్ర, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని నిహారికను వేడుకుంటుంది.

అయితే, నిహారిక తన సర్కిల్‌లో ఒక ‘రహస్య నేరం’ జరుగుతోందని తన భర్త కార్తీక్‌కు సమాచారం ఇస్తుంది. కార్తీక్ తన బృందంతో కలిసి రహస్యంగా దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఇంతలోనే, ఆ ముసుగు వ్యక్తి మరో ఘాతుకానికి పాల్పడతాడు. ఈసారి, కొత్తగా పెళ్లయిన వధువును ఆమె మొదటి రాత్రి టార్గెట్ చేస్తాడు. దంపతులిద్దరికీ మత్తుమందు ఇచ్చి, భర్త పక్కనే అపస్మారక స్థితిలో ఉండగా వధువుపై అత్యాచారం చేస్తాడు. ఈ సీరియల్ కిల్లర్ (రేపిస్ట్) ఎవరు? ఇన్స్పెక్టర్ కార్తీక్ అతన్ని ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.

విశ్లేషణ, నటీనటుల పనితీరు
‘విద్రోహి’ సినిమాలో రవిప్రకాష్, శివ కుమార్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ముఖ్యంగా రవి ప్రకాష్, తాను గతంలో చేసిన పోలీస్ క్యారెక్టర్లకు భిన్నంగా ఈ చిత్రంలోని పాత్రను పోషించారు. తన అనుభవాన్నంతా రంగరించి ఎంతో బాగా నటించాడు.

ఇప్పటివరకు టాలీవుడ్ తెరపై రాని సరికొత్త పాయింట్‌తో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘విద్రోహి’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు వి.ఎస్‌.వి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్‌లో తన ప్రతిభను చూపించాడు. తాను రాసుకున్న కథను ఎంతో అద్భుతంగా తెరపైకి ఎక్కించడంలో దర్శకుడు విజయం సాధించాడు. కథనం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపడేస్తుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు
‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు. పాటలు చాలా బాగున్నాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ (డీవోపీ) థ్రిల్లర్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. ఉపేంద్ర, ఎంఎన్ఆర్ ఎడిటింగ్, డ్రాగన్ ప్రకాష్ ఫైట్స్ సినిమాకు సాంకేతికంగా బలాన్ని చేకూర్చాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

ముగింపు
మొత్తం మీద, ‘విద్రోహి’ ఒక కొత్త పాయింట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సస్పెన్స్ థ్రిల్లర్. రవి ప్రకాష్ నటన, దర్శకుడి టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘విద్రోహి’ ఖచ్చితంగా నచ్చుతుంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *