వైసీపీ పాల్తూగాళ్లు.. అంటూ ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్!

అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పాల్తూగాళ్లు అంటూ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని, నెయ్యి కల్తీ ఉదంతాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు.
ముఖ్యాంశాలు:
వైకాపాది వింత ప్రతిభ: పాలు, వెన్న వంటి కనీస ముడిపదార్థాలు లేకుండానే నెయ్యి తయారు చేయగల ‘ప్రత్యేక ప్రతిభ’ ఒక్క వైకాపా నేతలకే సాధ్యమని ధూళిపాళ్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూ.360 వెన్న ధర ఉన్నప్పుడు, కేవలం రూ.320 లోపే నెయ్యి ఎలా సరఫరా చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
SIT నివేదికలో విస్తుపోయే నిజాలు: లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ కలిపినట్లు NDDB నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కల్తీ ద్వారా వచ్చిన అక్రమ సొమ్ములో రూ.12.5 కోట్లు విజయవాడకు, రూ.7.5 కోట్లు చెన్నైకు చేరినట్లు SIT విచారణలో తేలిందని వెల్లడించారు.
సంగం డెయిరీపై ఆరోపణలు అవాస్తవం: సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో కానీ, హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ కంపెనీతో కానీ ఎలాంటి సంబంధం లేదని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. ఒకవేళ ఆ సంస్థలు ఒకటే అయితే, గత ప్రభుత్వ హయాంలోనే టీటీడీ నుంచి టెండర్లలో పాల్గొనాలని తమకు మెయిల్స్ ఎందుకు పంపారో వైకాపా నేతలు చెప్పాలన్నారు.
అవినీతి చిట్టా: గత సీఎం జగన్ తన సొంత మీడియా సంస్థలకు రూ.307 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చుకున్నారని ఆరోపించారు.
భారతీ సిమెంట్స్ ద్వారా కాంట్రాక్టర్ల నుంచి 3 లక్షల టన్నుల సిమెంట్ మాయం చేశారని విమర్శించారు.
గతంలో తనపై పెట్టిన 22 అక్రమ కేసులను ప్రభుత్వం పునఃపరిశీలించి, రద్దు చేయాలని కోరారు.
పేర్ని నానిపై విమర్శలు:
మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ కాళ్లపై పడిన బందరు బియ్యం దొంగ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం” అని ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు.
నాణ్యతలో రాజీ లేదు:
దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీయేనని, దీనిపై ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేసినా, తనను 33 రోజులు జైల్లో పెట్టినా ఒక్క తప్పు కూడా నిరూపించలేకపోయారని గుర్తుచేశారు.

