smile smile smile smile smile smile smile smile smile smile smile

తాజాగా ఎన్నికల్లో ఓటమిపాలైన సినీ స్టార్స్…

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఈ దఫా జరిగిన ఎన్నికల్లో మహామహులు ఓటమిని చవిచూడటం విశేషంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మన దేశంలో రాజకీయ నాయకులే కాకుండా సినీ రంగానికి చెందిన వ్యక్తులు కూడా రాజకీయాలు చేసిన వారిని గతంలో చాలా మందిని చూశాం.
సినీ రంగానికి చెందిన ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత, కరుణానిధి వంటి ప్రముఖులు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా గొప్ప ప్రజాదరణ అందుకున్నారు. మరెందరో సినీ ప్రముఖులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగా కూడా పని చేశారు. ఎంతో మంది సొంత పార్టీలూ పెట్టారు. అయితే… తాజాగా వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారలకు మాత్రం ఓట్లరు చుక్కులు చూపించారు. మరీ ముఖ్యంగా తమిళనాట ‘మక్కల్ నీది కయ్యం’ పేరుతో సొంత పార్టీ పెట్టిన కమల్ హాసన్… తన నియోజకవర్గం నుంచే గెలవలేక పోవడం అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది. కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన ఆయన్ని బీజేపీ మహిళా నేత ఓడించారు. అలాగే కమల్ హాసన్ పార్టీ తరఫునే నిలబడిన సీనియర్ నటీమణి, దర్శకురాలు శ్రీప్రియ కూడా ఓడిపోయారు. రైటర్ స్నేహన్ కూడా ఓటమి పాలయ్యారు. మొత్తానికి చూసుకుంటే ఆయన పార్టీ ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం శోచనీయం. ఇక కమల్ హాసన్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కడ్చి అభ్యర్థులూ ఎక్కడా గెలవలేకపోవడం విచారకరం.
అదేవిధంగా కాంగ్రెస్ లో ఉండి, తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటి ఖుష్బూ కూడ ఓటమిని చవిచూశారు. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన మన్సూర్ అలీఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా కూడా గెలవలేకపోయారు. నామ్ తమిళర్ కట్చి పార్టీని పెట్టి పోటీచేసిన సీనియర్ నటుడు, దర్శకుడు సీమాన్ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. విశేషం ఏమంటే… తమిళనాడులో సినిమా రంగానికి చెందిన ఒకే ఒక యువ నటుడు విజయం సాధించాడు. అతనే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్. ఎన్నో సినిమాలలో హీరోగా నటించి, కొన్ని సినిమాలూ నిర్మించిన ఉదయనిధి తొలిసారి చెపాక్ – ట్రిప్లికేన్ అసెంబ్లీ నుండి డీఎంకే తరఫున గెలిచారు. ఇక కేరళలోనూ బీజేపీ తరఫున బరిలోకి దిగిన అలనాటి హీరో సురేశ్ గోపీ కూడా ఓడిపోవడం షాక్ కు గురిచేసింది.
అంతేకాకుండా సౌత్ ఇండియాలో సినిమా తారల పరిస్థితి ఇలా ఉంటే… బెంగాల్ లో మాత్రం తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన సినిమా వాళ్ళకు విజయం వరించింది. ఉత్తర్ పారా నుండి పోటీచేసిన కాంచన్ మల్లిక్, బార్రక్ పూర్ నుండి టీఎంసీ తరఫున బరిలో దిగిన రాజ్ చక్రవర్తి, మెద్నీపూర్ నుండి పోటీ చేసిన జునేమలియా, బంకురా అసెంబ్లీలో నిలబడిన సయంతిక బెనర్జీ విజయాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. ఇంకా టీఎంసీ నుండి పోటీ చేసిన నటి సయోనీ ఘోష్ మాత్రం అసాన్ సోల్ లో ఓటమిని చవిచూసింది. కాగా బీజేపీ నుండి చండితల నియోజవర్గంలో నిలబడిన నటుడు యశ్ దాస్ గుప్తా ఓడిపోయారు. మొత్తం మీద సినిమా గ్లామర్ కంటే కూడా ఈ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలు, వాటి పనితనానికే ప్రజలు ఓట్లు కుమ్మరించడం చరిత్ర అనే చెప్పాలి

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *