చియాన్ విక్రమ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఐ’. రివేంజ్ డ్రామాగా ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇటీవల స్టార్ మా ఛానెల్లో ప్రసారమైంది.భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు ‘చియాన్’ విక్రమ్ కాంబినేషన్లో ఐదేళ్ల క్రితం వచ్చిన చిత్రం ‘ఐ’. బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్. శంకర్-విక్రమ్ కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అంతకుముందు వీరి కాంబినేషన్లో ‘అపరిచితుడు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ‘ఐ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణంగానే శంకర్ సినిమా అంటే ఆ స్థాయి వేరేగా ఉంటుంది. ‘ఐ’ సినిమా పోస్టర్లు, ట్రైలర్, విక్రమ్ వేషధారణ చూసి ఇది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనుకున్నారు. కానీ, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.2015 జనవరి 14న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ‘ఐ’ అంచనాలను అందుకోవడంలో విఫలైంది. అయితే, డైరెక్టర్ శంకర్‌కు ఉన్న క్రేజ్‌తో ఓపెనింగ్స్ అయితే భారీగా రాబట్టింది ఈ చిత్రం. విక్రమ్‌తో ‘అపరిచితుడు’ లాంటి సందేశాత్మక చిత్రం తెరకెక్కించిన శంకర్.. ఈసారి మాత్రం లవ్ అండ్ రివేంజ్ డ్రామాను తెరపై ఆవిష్కరించారు. ఈ రివేంజ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. విమర్శలపాలైంది. అసలు విక్రమ్ ఈ సినిమాను ఎలా అంగీకరించారు అని కూడా చాలా మంది అడిగారు.
వెండితెరపై ఫ్లాపయిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ఘన విజయాన్ని అందుకుంది. ‘ఐ’ శాటిలైట్ రైట్స్‌ను అప్పట్లో స్టార్ మా ఛానెల్ కొనుగోలు చేసింది. అయితే, పలు కారణాల చేత టెలివిజన్ ప్రీమియర్ కాలేదు. ఎట్టకేలకు ఐదేళ్ల తరవాత గతవారం ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను స్టార్ మా ప్రసారం చేసింది. ఐదేళ్ల తరవాత ఎవరు చూస్తారులే అని చాలా మంది అనుకొని ఉండొచ్చు. కానీ, చూశారు. అది కూడా భారీ స్థాయిలో. దీనికి 11.1 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇన్నేళ్ల తరవాత కూడా ఈ స్థాయిలో టీఆర్పీ రావడం విశేషం.
Post Views:
364