ఏపీ స్పీకర్ పై కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారంపై విరుచుకు పడ్డారు. తాజాగా కూన రవికుమార్ కు కోర్టులో ఊరట లభించింది. రాజాం సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిల న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఆయనక మంజూరు చేసింది. అయితే ప్రతి నెలా రెండవ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు పొందూరు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
అయితే ఇది ఇలా ఉంటే.. తమ్మినేని సీతారాంపై కూన రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆమదాలవలస నడిరోడ్డుపై తమ్మినేనిని గుడ్డలూడదీసి పరిగెట్టిస్తానని వ్యాఖ్యానించారు. తమ్మినేని ఇంట్లో ఓ ఊరకుక్క అనవసరంగా మొరుగుతోందని, పోలీసులు కూడా ఆ ఊరకుక్క మాటలు విని తప్పు దారి పడుతున్నారని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా డమ్మాబుస్సుల సీతారాం అరాచకాలను అడ్డుకోవడానికే టీడీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిందని, ఆమదాలవలసలో అబ్బా కొడుకుల దురాగతాలను అంతమొందించడమే మా లక్ష్యమని ఆయన మండిపడ్డారు. ఆమదాలవలసను అన్ని రకాలుగా దోచుకుంటున్నారని తెలిపిన ఆయన తమ్మినేని ఉడత ఊపులకు భయపడే నైజం తనది కాదని వివరించారు. తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టనని పోలీసు వ్యవస్థపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. చివరగా ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరినీ విడిచిపెట్టనని కూడా వివరించారు. కాగా పోస్టింగ్ ల కోసం కక్కుర్తి పడి తనపై కేసులు పెట్ట వద్దని ఎస్పీని హెచ్చరించారు కూన రవికుమార్.