సోనూసూద్ తో క్రిష్ పాన్ ఇండియా మూవీ..
కరోనా కాలంలో సోనూసూద్ చేస్తున్న సేవను గురించి చెప్పేందుకు కూడా మాటలు రావు. ఆయన చూపుతున్న మానవత్వం గురించి సోషల్ మీడియా నిత్యం కొనియాడుతుంది. అయితే తాజాగా సోనూసూద్ కీలక పాత్రతో.. ప్రముఖ దర్శకుడు క్రిష్… ఓ సూపర్ సబ్జెక్ట్ తయారు చేశాడని తెలుస్తోంది. అలాగే ఈ స్క్రిప్ట్ ను సోనూసూద్ కు వినిపించగానే అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమచారం అందుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ క్రేజీ పాన్ ఇండియా మూవీ తయారవుతుందని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
కాగా గతంలో సోనూసూద్… క్రిష్ దర్శకత్వం వహించిన ‘మణికర్ణిక’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. అనివార్య పరిస్థితుల్లో క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడం సోనూ సూద్ ను కూడా బాధకు గురిచేసింది. ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరిద్దరి ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెరకెక్కబోతోందని సమాచారం. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇంకా వైష్ణవ్ తేజ్ తో క్రిష్ తీసిన ‘కొండపొలం’ నవలా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక దిల్ రాజు, క్రిష్ సంయుక్తంగా నిర్మించిన ‘101 జిల్లాల అందగాడు’ మూవీ విడుదలకు రెడీగా ఉంది.