చిరు-పవన్ మల్టీస్టారర్ ఎప్పుడు?
కొన్నేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఖైదీనంబర్ 150తో గ్రేట్ కంబ్యాక్ అవ్వగానే మెగా మల్టీస్టారర్లపై రకరకాల ఊహాగానాలు సాగాయి. అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలిపి మెగా మల్టీస్టారర్ ని రూపొందించేందుకు టీఎస్సార్ – అశ్వనిదత్ ద్వయం ప్రయత్నించింది. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని కూడా ప్రకటించారు.
కానీ గడిచిన ఇన్నేళ్లలో ఏనాడూ ఆ ప్రాజెక్ట్ గురించి ఆ ఇద్దరూ మాట్లాడనేలేదు. త్రివిక్రమ్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. బహుశా జనసేనాని నుంచి క్లారిటీ మిస్సయ్యిందని అభిమానులు భావించారు.
తాజాగా త్రివిక్రమ్ సారథ్యంలోనే మరో మెగా మల్టీస్టారర్ గురించి చర్చలు సాగుతున్నాయన్న టాక్ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ -సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఈ మెగా మల్టీస్టారర్ ను మాయావి సెట్ చేస్తున్నాడని తెలిసింది. ఈ మల్టీస్టారర్ కోసం ప్రణాళికలు త్రివిక్రమ్ వద్ద స్పష్ఠంగా ఉన్నాయి. ఇది తమిళ చిత్రం వినోదయ సితంకి తెలుగు రీమేక్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సముద్రఖని దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – జీ స్టూడియోస్ ఈ రీమేక్ కు పెట్టుబడులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతి త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది.
త్రివిక్రమ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ రిలీజ్ ప్రమోషన్స్ లో ఉన్నారు. పవన్ కల్యాణ్ – రానా కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుందని సమాచారం. తదుపరి మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తారు. మరోవైపు పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లుతో బిజీ కానున్నారు.