రాబిన్ హుడ్ తరహాలో ఈసారి జనసేనాని సినిమా….
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేవలం హీరోనే కాదు…. జనసేనాని కూడా… అందుకే ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు బాధ్యతగా ఉండాలి. సమాజ హితమై ఉండాలి. అయితే క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమాలో కూడా జనహితమైన పాత్రలో జనసేనాని మెరవబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రాణం పెట్టి తీయనున్నారు. ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పీరియాడిక్ మూవీస్ తో బిగ్ హిట్ సాధించిన క్రిష్… ఇప్పుడు పవన్ ను ‘హరి హర వీరమల్లు’గా చూపించి, అదే మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యంగా ధనవంతులను దోచి, పేదవారికి పంచే పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నారని సమాచారం. ఇలాంటి కథలు వినగానే మనకు ఇంగ్లిష్ ఫోక్ లోర్ హీరో రాబిన్ హుడ్ గుర్తుకు వస్తాడు. ధనవంతులను దోచుకొని, పేదలకు పంచే పాత్రగా రాబిన్ హుడ్ జనం మదిలో గూడుకట్టుకొని ఉన్నాడు. రాబిన్ హుడ్ 14వ శతాబ్దానికి చెందినవాడిగా రచయితలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. కాగా క్రిష్ తన స్టోరీలో వీరమల్లును 17వ శతాబ్దానికి చెందినవాడిగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మన దేశం వచ్చిన విదేశీయులను వీరమల్లు ముప్పుతిప్పలు పెట్టే సన్నివేశాలు ఉన్నాయని కూడా సమాచారం.
అంతేకాకుండా రాబిన్ హుడ్ ఆ నాటి ఇంగ్లిష్ షరీఫ్స్ కు కంటిమీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘హరి హర వీరమల్లు’లో హీరో పాత్ర మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో నాటి అన్యాయాలను ఎదిరిస్తూ సాగుతుంది. ఔరంగజేబు 49 ఏళ్ళు పాలించాడు. అతని పాలనా కాలంలో విదేశీయులు పాశ్చాత్యులు మన దేశంలో తొలి అడుగులు వేశారు. ఆ రోజుల్లో ఎంతోమది పేదలకు అన్యాయం జరిగింది. దానిని ఎదిరించి, వీరమల్లు ఎలా జనం మదిని గెలుచుకున్నాడు అనేదే ‘హరి హర వీరమల్లు’ స్టోరీగా తెలుస్తోంది. జనసేనాని పవన్ ఇలాంటి స్టోరీలో నటిస్తే జనానికి మరింత చేరువ అవుతాడని ఫ్యాన్స్ కూడా తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి ఫ్యాన్స్ కు తగినట్లుగా వారికి నచ్చే అంశాలు, వారిని మెప్పించి విజుల్ వేయించే అంశాలు ఈ సినిమాలో బాగా ఉన్నట్లు సమాచారం. కాగా ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ ‘హరి హర వీరమల్లు’ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరి రాబిన్ హుడ్ ను తలపించే వీరమల్లు ఏ విధంగా ఫ్యాన్స్ ను ఫిదా చేయనుందో చూడాలి. అలాగే అదే సినిమా ఆయన్ని రాజకీయ నాయకుడిగా మరో మెట్టు ఏవిధంగా ఎక్కించనుందో వేచి చూడాలి.