భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం
భారత్ తక్కువ సమయంలోనే 100 కోట్ల టీకాల మైలు రాయిని అందుకుందని ప్రధాని మోదీ అన్నారు. రోజుకు కోటి డోస్‌ల టీకాలు వేయడమంటే చిన్న విషయం కాదని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా భారత్ ఫార్మా శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు ప్రధాని మోదీ.
భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల (100 crore vaccination) మైలు రాయిని అధిగమించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi)జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇది భారత్ సాధించిన అతి పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. మన టీకాలతో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి చూపించామన్నారు ప్రధాని మోదీ. అక్టోబరు 21న వంద కోట్ల కోవిడ్ టీకాల మార్కును చేరుకున్నాం. ఆ మైలురాయితో భారత దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాం. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఇది సాధ్యమయింది. ఇది భారత్ విజయం. భారతీయులందరి విజయం. 100 కోట్లు అనేది సంఖ్య కాదు.. దేశ ప్రజల సంకల్పం.
కరోనా వ్యాక్సిన్‌ల ద్వారా భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి చూపించాం. 100 ఏళ్లలో ఇలాంటి మహమ్మారిని ఎప్పుడూ చూడలేదు. ఇది మనకు అతి పెద్ద సవాల్ విసిరింది. కానీ మనందరం కలిసి కట్టుగా పోరాడి కోవిడ్‌ను ఎదుర్కొన్నాం. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ కరోనాను ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్నలు ప్రపంచమంతటా ఉత్పన్నమయ్యాయి. భారత్ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయగలదా? అంతమందికి టీకాలు ఎలా ఇవ్వగలదు? ఎక్కడి నుంచి టీకాలు తెస్తారు? టెక్నాలజీ ఉందా? ఇలా ఎన్నో అనుమానాలున్నాయి. వాటన్నింటికీ ఈ 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయే సమాధానం.
కరోనా కట్టడికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్‌తో మంచి ఫలితాలు సాధించాం. వీఐపీ కల్చర్‌కు తావులేకుండా అందరికీ సమానంగా టీకాలు పంపిణీ జరిగింది. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ టీకాలు అందాయి. దీపాలు వెలిగించడం, పళ్లేలను మోగించడంతో కరోనాపై మన పోరాటం మొదలయింది. ఇలా చేస్తే కరోనా పోతుందా? అని చాలా మంది వెటకారం చేశారు. కానీ ఆ సంకల్పమే కరోనాపై విజయానికి పునాది వేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజలు టీకాలు వేసుకునేందుకు ఇప్పటికీ ముందుకు రావడం లేదు. కానీ మనం తక్కువ సమయంలోనే 100 కోట్ల మైలురాయిని చేరుకున్నాం. రోజుకు కోటి డోసుల టీకాలు వేశామంటే సామాన్య విషయం కాదు.
అభివృద్ధి చెందిన దేశాలకు టీకాలు కొత్త కాదు. కానీ మనం గతంలో ఇతర దేశాల నుంచి టీకాలను దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ కరోనాను ధీటుగా ఎదుర్కొని దేశీయంగా టీకాలు తయారు చేసుకోగలిగాం. ఇప్పుడు భారత్ సురక్షితమైనది. మన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి టీకాను తయారు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టీకాలను అభివృద్ధి చేశారు. ఈ టీకాలతో భారత్ ఫార్మా శక్తి ఏంటే ప్రపంచానికి తెలిసింది. మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ పూర్తి శాస్త్ర సాంకేతికతతో జరగడం అందరూ గర్వించే విషయం. సాంకేతిక పరిజ్ఞానంతో మారమూల గ్రామాలకు కూడా టీకాలను పంపిణీ చేయగలిగాం.
అంతర్జాతీయ నిపుణులు కూడా భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడమే కాదు.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. పండగ వేళల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందరూ మాస్క్ ధరించాలి. ఇప్పటి వరకు ఎవరైనా టీకా వేసుకోకుంటే వారందరూ వెంటనే వెళ్లి టీకాలు వేసుకోవాలి. టీకాలు వేసుకున్న వారు ఇతరులను ప్రోత్సహించండి.
గతంలో విదేశీ వస్తువుపై ఆధారపడే వాళ్లం. కానీ మేకిన్ ఇండియాతో అన్ని మన దేశంలోనే తయారవుతన్నాయి. ఈ దీపావళిని స్వదేశీ వస్తువులతోనే జరుపుకుందాం.