ఏపీ రాజకీయలపై ఆర్జీవీ ట్వీట్… నేతలకు అదిరిపోయే సలహా..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఎన్నడూలేనంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత పట్టాభి కామెంట్స్ తర్వాత జరిగిన పరిణామాలతో ఇటు వైఎస్ఆర్సీపీ(YSRCP).. అటు టీడీపీ (TDP)లు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక రాజకీయ, సామాజిక అంశాలపై స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తనదైన శైలిలో స్పందిస్తుంటారు. కొందరిపై సైటర్లు, మరికొందరికి నేరుగానే కౌంటర్లు ఇస్తుంటారు. ఇటీవలే కొండా సినిమా షూటింగ్ విషయంలో నేరుగా టీఆర్ఎస్ (TRS)నేతలకు వార్నింగ్ ఇచ్చిన ఆర్జీవీ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ప్రస్తుత పరిస్థితులపై ఆర్జీవీ ట్విట్టర్ (RGV Tweet) ద్వారా స్పందించారు. ఏపీలో రాజకీయ నేతలు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఆర్జీవీ ట్వీట్ కు మంచి రెస్పాన్సే వస్తోంది. చాలా కరెక్ట్ గా చెప్పారు సర్ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. అంతేకాదు ఏ విషయంలోనేనా సూటిగా మాట్లాడే వ్యక్తి మీరొక్కరే అంటూ రిప్లైలు ఇస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ చాలాసార్లు ఏపీ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేకాదు ఏకంగా సినిమాలే తీశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్ వంటి సినిమాలను తీశారు. వీరిలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ పోలిన పాత్రలతో సినిమాలు తీసి వారివారి అభిమానుల నుంచి విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొన్నా అందరి దృష్టినీ ఆకర్షించారాయన. తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇక ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కొందరు వైసీపీ అభిమానులు దాడి చేసిన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దాడికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36గంటల దీక్ష చేపట్టగా.., దీనికి కౌంటర్ గా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహదీక్షకు పిలుపునిచ్చింది. ఎక్కడిక్కడ వైసీపీ, టీడీపీ నేతల నిరసనలు, దీక్షలతో వాతావరణం వేడెక్కింది.
చంద్రబాబు దొంగదీక్ష చేస్తున్నారని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపించారు. ఈ అంశంలో చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఏపీ రాజకీయాల్లో తండ్రీకొడుకులిద్దరూ నాటకాలాడుతున్నారని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అవలేదా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో కూర్చొని చీకట్లో వైఎస్ఆర్ విగ్రహాలను,ఆలయల్లో రథాలను తగుల పెట్టించారని ఆరోపించారు. సీఎం జగన్ ను దూషిస్తే రియాక్షన్ మరింత సీరియిస్ గా ఉంటుందని ఆమె హెచ్చరించారు.